హైదరాబాద్‌కు 160 కిమీలు, కరీంనగర్ పట్టణానికి 36 కిమీల దూరంలో ఉన్న వేములవాడ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్నది. ఇక్కడ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలసిన రాజరాజేశ్వరస్వామి పూజలందుకుంటున్నాడు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడను శివరాత్రి రోజున ఐదు లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా.
స్ధలపురాణం -
లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యత్తోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక రుషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
ప్రత్యేకతలు
వేములవాడ గుడి ఆధ్వర్యంలో 1956 నుంచి వేములవాడ, కరీంనగర్, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతున్నది. వేములవాడలో డిగ్రీస్థాయి వరకు సంస్కృత భాష బోధించబడుతున్నది.
11వ శతాబ్ది తెలుగు కవి వేములవాడ భీమకవి, కన్నడ ఆదికవి పంపన వేములవాడ వాస్తవ్యులే!!
శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్లో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.