కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారమై శ్రీ శైలముపై భ్రమరాంబికా సమేతుడై కొలువుదీరి ఉన్నాడు మల్లిఖార్జున స్వామి.ఎంతో పరమ పావనమయిన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి.ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిసారు.ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు ప్రసిద్ది.ఈ పుణ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు చేసిన పాపాలన్ని సమసిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ నమ్మిక.
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల లోని దట్టమయిన అటవీ ప్రాంతంలో కృష్టా నదీ తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో కలదు.అలాగే శ్రీశైల శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో ఉంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడ నివశించే కొండ జాతి వారు మల్లన్నను తమ అల్లునిగా భ్రమరాంబికా అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు.అలయంలో పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు.ఇక్కడ శివరాత్రి సంధర్భంగా నిర్వహించే రధోత్సవంలో రధాన్ని వీరే లాగుతారు.స్వామివారి ఆలయాన్ని- శతవాహనులు, యుక్ష్వాకులు,పల్లవులు,కాకతీయులు,విజయనగరాధీసులు మొదలయిన రాజవంశాల వారు అభివృద్ది చేస్తూ వచ్చారు.
ఈ ఆలయం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది.స్వామి వారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట.ఆలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారట.ఎంతో మంది ఋషి పుంగవులు స్వామి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమొనరించి ముక్తి పొదారట.అధేవిదంగా శ్రీ శంకారాచార్యులు వారు స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబికాష్టకాన్ని,శివునిపై శివానందలహరిని రంచించారు.