భారతదేశ వీర వనితల్లో ఒకరుగా పేరు గాంచిన రాణీ రుద్రమదేవి మన తెలుగునేలపై పుట్టడం మనకు గర్వకారణం.కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన రుద్రమ దేవి కాకతీయ రాజు అయిన గణపతిదేవుని రెండవ పుత్రిక.రుద్రమదేవి అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేనందున రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు.తన తండ్రి తర్వాత రాజ్యాన్ని పరిపాలించే భాద్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న రుద్రమ శత్రువులని చీల్చి చెండాడి ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా పరిరక్షించింది.
నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు రుద్రమదేవి భర్త. రుద్రమకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ,రెండవ కుమార్తె రుయ్యమ్మ .ముమ్మడమ్మ మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి పొగిడాడు.
|