1909లో కాకినాడలో జన్మించిన దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. సంఘ సంస్కర్తగా బాల్య వివాహము, వరకట్నం వంటి దురాచారాలపై పోరాడింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న చోటు చేసుకుంది. ఈవిడ 1953 ఆగష్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (ఛెంత్రల్ శొచీల్ వెల్ఫరె భోర్ద్ - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తివిద్యాకేంద్రాలు నెలకొల్పారు. వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది.
|