ఫైడ్ ఎలో రేటింగ్లో 2600 పాయింట్లను దాటి భారతదేశం నుండి ఈ ఘనత సాధించిన తొలి చెస్ క్రీడాకారిణిగా నిలిచిన కోనేరు హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాకుండా మొత్తం గ్రాండ్ మాస్టర్లలోనే అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది హంపి అరుదైన రికార్డు సృష్టించింది. కేలవం 15 సంవత్సరాల 1 నెల, 27 రోజుల వయస్సులోనే హంపి ఈ ఘనత సాధించింది.ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి (కోనేరు అశోక్) ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, ఆమె ప్రతిభని గుర్తించిన ఆమె తండ్రి అశోక్ తన ఉద్యోగాన్ని మానివేసి హంపికి పూర్తి స్థాయి శిక్షకునిగా మారారు. చదరంగంలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది