ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రి. వితంతువైనా స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వనిత నాగమ్మ.ఒక మహిళ అయి ఉండి మహా మంత్రిణి అయి, రాజ్యాన్ని, రాజును నడిపించి, యుద్దానికి సారధ్యం వహించి, గెలుపు సాధించిపెట్టిన అపర చాణక్య మేధా సంపన్నత నాగమ్మ సొంతం.నాగమ్మ తండ్రి రామిరెడ్డి కరీంనగర్ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం నుండి తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామంకు వచ్చాడని చరిత్ర చెబుతుంది.11వ శతాబ్ధకాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ పైగా బాల వితంతువు. మంత్రిస్థాయికి ఎదగడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సమర్ధపాలన యుద్ధనైపుణ్యాలతో స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది.
గోపన్న మంత్రి పర్యవేక్షణలో నాగమ్మ చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొంది, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధించింది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేసింది. రామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో నాగమ్మ వివాహం జరిగింది. వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ వితంతువు అవుతుంది. కొంతకాలం తర్వాత రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తాడు అనుగురాజు. రామిరెడ్డి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో, బ్రహ్మనాయుడు ఆగ్రహించి ఓ రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేసి పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.ఇలా యుక్తవయస్సు నాటికే తండ్రినీ, నిలువ నీడ నిచ్చిన మేనమామను, (అప్పటికే) భర్తను కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి చేసుకుని బతుకీడ్చింది.
స్థానికుల తలలో నాలుకలా మెలగుతూ, వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందింది. ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమైనారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తాగునీరు, భోజన వసతి కల్పించింది. అనుగురాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘ప్రజల కోసం ఏదైనా చేయవచ్చనే ఉద్దేశ్యం’తో ‘ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది. ‘సరేనన్న’ అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.
|