1
|
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ. |
భావం -అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను.
|
2
|
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ. |
భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
|
3
|
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ. |
భావం - మంచిబుద్ది కలవాడా ! శ్రీరాముని కరుణ చేత,ప్రజలందరూ మెచ్చునట్లు అందరికీ హితమయున నీతులు చెప్పుము.
|
4
|
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ. |
భావం - బంగారపు సిమ్హసనములో మంచి ముహూర్త బలమున కుక్కను తీసుకు వచ్చి కూర్చోపెట్టినా దాని గుణము ఎలా మార్చుకోదో అధేవిధంగా అల్పుడుకు ఎంత గౌరవము ఇచ్చినా సరే తన నీచత్వమును వదలడు.
|
5
|
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ. |
భావం- చరువులో నిండా నీరు చేరినపుడు వేల కొలది కప్పలు ఎలా అయితే చేరునో అలాగే సంపద కలిగినపుడు భందువులు కూడా అలానే చేరును.
|
6
|
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ. |
భావం- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
|
7
|
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. |
భావం- ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.
|
8
|
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. |
భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.
|
9
|
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ |
భావం- ఎంత అడిగినా జీతము ఇవ్వని యజమానిని సేవించి కష్టపడుట కంటే మంచి యెద్దులను కట్టి పొలమి దున్నుకొని బతకడం మంచిది.
|