Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Kumara satakam

కుమార శతకం

1
మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు ;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!
భావం - ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.
2
సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
భావం - ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలలోనే మంచి జ్ఞానమును సంపదిస్తారు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.
3
సత్తువగల యాతడు పై
నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్
విత్తము గోల్పడు నతడును
జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!
భావం - ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో,నిత్యము బాధలతో నుండును.
4
వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!
భావం - పెద్దలను గౌరవించేవాడిని, మంచి బుద్ది కలవాడని,మంచి తెలివి తేటలు కలవాడనీ, ధర్మం తెలిసిన వాడినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.
5
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్నతలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!
భావం - నీకు ఉన్నా, లేకున్నా సరే ఆ విషయం బయటికి తెలియనియ్యకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.
6
ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె ? కుమారా!
భావం - ఈ లోకమునందు ధనవంతుడిని అన్ని మంచి లక్షణాలు కల ఉత్తముడుగా భావిస్తారు. సంపద కలవాడినిగా , గొప్ప కులంలో జన్మించినవాడినిగా అందగాణ్ణిగా బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.
7
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య కుమారా !

భావం- గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలి పెట్టకు.

8
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!

భావం- జరిగిన దాని గురించి భాదపడకు, చెడ్డవారిని ఎలాంటి పరిస్థితులలో పొగడకు. సాధ్యం కాని పనులు వదిలిపెట్టు. దైవం ఎలా నడిపిస్తే అంతా అలాగే జరుగుతుంది.

9
సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా !
భావం- సంపద బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద కలిగిన మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.
10
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల తలపకు, క్రూరల
ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా !

భావం- మనసులో ఎప్పుడూ చెడ్డ ఆలోచనలకు చోటివ్వవద్దు. కాపాడతానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకో దుర్మార్గుల ఆదరణను ఎప్పుడూ నమ్మవద్దు.

Page 1

తెలుగు పద్యాలు